Saturday, October 27, 2012

తను అడిగిన ప్రశ్న " నీ పేరేంటి ? " అని...

ఆ తర్వాత 3 రోజుల వరకు వరుసగా తను
నాకు చాక్లేట్స్ ఇస్తూనే ఉంది...
సడనుగా ఒకరోజు నాకోసం ఏం తెచ్చావ్ ? అన్నది.
నేను ఏ మాత్రం ఆలోచించకుండా
" నీవు కోరుకున్నది నీకెప్పుడో ఇచ్చేసాను.
దానికంటే విలువైనది ఇంకేమీ లేదు. "
అని సమాధానం ఇచ్చాను...
వెంటనే " నేను ఊహించిన జవాబే ఇచ్చావు... " అన్నట్లు
తన ముఖం లో చిన్న చిరునవ్వు చోటు చేసుకుంది...

అప్పటి వరకు వెనక పెట్టిన చేతులని ముందుకు తెచ్చి,
నా చేతులలో ఒక చిన్న పుస్తకం పెట్టింది...
దాని పేరు " My Heart With No Vacancy "...
నేను కళ్ళు పెద్దవి చేసి తన వైపు చూసాను...
ఆ చూపు లోని ఉద్దేశ్యం
" చదివేది 3 వ తరగతి, ఇంగ్లిష్ స్పెల్లింగ్సే సరిగా రావు...
ఈ పుస్తకం చదవాలా..!!!? " అని.
తను అది త్వరగానే అర్దం చేసుకుంది...

ఒక్క కాలు మీద మోపు చేసి నించుని, కనుబొమ్మలు పైకి పెట్టి
" ఈ పుస్తకం నువ్ ఇప్పుడు చదవనవసరం లేదు.
నీకు ఎప్పుడైతే ఇంగ్లిష్ పర్ఫెక్ట్ గా వస్తుందో అప్పుడు చదువు చాలు. "
అనేసరికి " హమ్మయ్య..! " అనే ఒక భావన నా ముఖం పై చోటు చేసుకుంది.
సరేలే టాటా అని చెప్పి వెనక్కి నడిచాను...
తను కూడా వాళ్ళ ఇంట్లోకి కదిలింది.

కొంత దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి పిలిచింది.
వెళ్ళాను...త్వరగా చెప్పు లేట్ అవుతోంది అన్నాను...
అప్పుడు తను అడిగిన ప్రశ్న " నీ పేరేంటి ? " అని...
నేను షాక్ తిన్నాను...
నా పేరు తెలియకుండానే స్నేహం చేస్తున్నావా ?? అని అడిగాను.
తను " మనసు అవసరాలు కోరితే స్నేహం కలుషితం అవుతుంది.
అందుకే తెలుసుకోలేదు... " అని సమాధానం ఇచ్చింది.
మరైతే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ? అని ఎదురు ప్రశ్న వేసాను.
" స్నేహం మొదలు పెట్టటానికి పేరు అవసరం లేదు...
కానీ స్నేహం లో పేర్లు తెలుసుకోవాలిగా... " అంది.
నేను చిన్న నవ్వు నవ్వి
" నన్ను నా వాళ్ళు చిన్నా అని పిలుస్తారు... " అని చెప్పి వెళ్ళిపోయాను...
నేను ఆ సందు తిరిగేంత వరకు తను నా వైపు చూస్తూనే ఉంది.
ఆ తర్వాత తను కూడా వాళ్ళింట్లోకి వెళ్ళిపోయింది...

ఆరోజు తను చూసిన చూపు, ఆ చిరునవ్వు నాకిప్పటికీ గుర్తున్నాయి.
ఆ గురుతులు ఎప్పటికప్పుడు నా బాధలని తుంచేస్తుంటాయి.

-
చిన్నా ( జి.వి.ఆర్ )

2 comments: