Tuesday, December 4, 2012

అక్కడ నా పేరూ తన పేరూ రాసి ఉన్నాయి...

అలా మొదలై దాదాపు రెండు నెలలు సాగిన మా స్నేహం లో
ప్రతిరోజూ ముచ్చట్లు, గిఫ్టులు...
ఏరోజూ చిన్న తగువు కూడా రాలేదు...
ఎప్పుడూ ఏదొ ఒక విషయం చెప్తుండేది...

నేను కలసిన వాళ్ళలో తను చాలా డిఫరెంట్...
తన ఆలోచనలు, పనులు, మాటలు అన్నీ చాలా డిఫరెంట్...
తనకొక సపరేట్ లోకం ఉండేది...
కాదు తనే ఒక కొత్త ప్రపంచాన్ని సృస్టించుకుంది...
అందులో ఎప్పుడూ సంతోషమే, తనేం మాయ చేసిందో
తెలియకుండా నేను కూడా తన లోకం లో భాగమైపొయాను...

ఒకరోజు సాయంత్రం తను వాళ్ళ ఇంటికి పిలిచింది...

నేను అన్నయ్యకి ఏదో సాకుతో తర్వాత వస్తా అని చెప్పి
వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
వాళ్ళ అమ్మ నీపేరేంటి బాబూ అంది...
నన్ను చిన్నా అని పిలుస్తారండి అని చెప్పాను...
ఏం చదువుతున్నవ్ ? అని అడిగి, ఇంకా ఎదో అడగబోతుంటే
నా బొమ్మలు చూస్తావా ??? అని వాళ్ళ అమ్మ నోటికి తాళం వేసింది కావ్య...
వాళ్ళ అమ్మ " సరే మీరు అడుకుంటూ ఉండండి, నేను తినటానికి తీస్కువస్తాను. "
అని లోపలకి వెళ్ళింది...
నేనూ కావ్యా తన రూం లోకి వెళ్ళాం.
తనేదో బుక్ ఓపెను చేస్తుంటే " బొమ్మలు చూపిస్తా అని బుక్ తీస్తోందేంటి " అనుకున్నా...
తను ఆ పుస్తకం తెరవగానే నేను అవాక్కయ్యాను.

అది తన డ్రాయింగ్ బుక్...
తన రంగుల ప్రపంచానికి ఇంకా రంగులు దిద్దింది...
ఒక్కొక్క పేజీ తిప్పుతూ వడి వడిగా కదులుతున్న నా చేతులు
ఒక్క సారిగా ఆగిపోయాయి. నా చూపు ఆ పేజీకి అతుక్కుపోయింది...

సూర్యుడు కొండల చాటున దాక్కుని మేఘాలకు దారిస్తుంటే
ఆ మబ్బుల నీడన చేతులు పెన వేసుకుని చిన్నారి స్నేహితులిద్దరు
నడుస్తూ ఉన్నారు...
అక్కడ నా పేరూ తన పేరూ రాసి ఉన్నాయి...
ఈ బొమ్మ ఎప్పుడు వేసావు ? అని అడిగాను తనని.
" ఒక రోజు నాకు వచ్చిన కల ఇది.
ఆ తర్వాతి రోజే నిన్ను చూసాను...
ఆ సాయంత్రమే ఇది వేసాను. ఎలా ఉంది ? " అంది.
నా నోట మాట లేదు...
నేను ఇంకేమి మాట్లాడకుండా అక్కడ నుండి వచ్చేసాను.
తను ఏం అనుకుందో తెలీదు,
ఎందుకలా వెళ్ళిపోయావ్ ? అని కూడా ఎప్పుడూ తను నన్ను అడగలేదు...

ఆ డ్రాయింగ్ చూసిన క్షణం నా మనసు నిశ్చలంగా ఉండిపొయింది.
తన ఊహకి నమ్మకాన్ని చేర్చిన తీరు నన్ను కదిలించి వేసింది...
జీవితం లో తననెప్పుడూ సంతోషంగా ఉంచాలని
ఆ క్షణం నిశ్చయించుకున్నాను...
తన చివరి క్షణాల వరకూ కూడా అలానే ఉండటానికి ప్రయత్నించాను.
తను మాత్రం నాకు తన గురుతులను మాత్రమే వదిలి వెళ్ళింది.