Tuesday, December 4, 2012

అక్కడ నా పేరూ తన పేరూ రాసి ఉన్నాయి...

అలా మొదలై దాదాపు రెండు నెలలు సాగిన మా స్నేహం లో
ప్రతిరోజూ ముచ్చట్లు, గిఫ్టులు...
ఏరోజూ చిన్న తగువు కూడా రాలేదు...
ఎప్పుడూ ఏదొ ఒక విషయం చెప్తుండేది...

నేను కలసిన వాళ్ళలో తను చాలా డిఫరెంట్...
తన ఆలోచనలు, పనులు, మాటలు అన్నీ చాలా డిఫరెంట్...
తనకొక సపరేట్ లోకం ఉండేది...
కాదు తనే ఒక కొత్త ప్రపంచాన్ని సృస్టించుకుంది...
అందులో ఎప్పుడూ సంతోషమే, తనేం మాయ చేసిందో
తెలియకుండా నేను కూడా తన లోకం లో భాగమైపొయాను...

ఒకరోజు సాయంత్రం తను వాళ్ళ ఇంటికి పిలిచింది...

నేను అన్నయ్యకి ఏదో సాకుతో తర్వాత వస్తా అని చెప్పి
వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
వాళ్ళ అమ్మ నీపేరేంటి బాబూ అంది...
నన్ను చిన్నా అని పిలుస్తారండి అని చెప్పాను...
ఏం చదువుతున్నవ్ ? అని అడిగి, ఇంకా ఎదో అడగబోతుంటే
నా బొమ్మలు చూస్తావా ??? అని వాళ్ళ అమ్మ నోటికి తాళం వేసింది కావ్య...
వాళ్ళ అమ్మ " సరే మీరు అడుకుంటూ ఉండండి, నేను తినటానికి తీస్కువస్తాను. "
అని లోపలకి వెళ్ళింది...
నేనూ కావ్యా తన రూం లోకి వెళ్ళాం.
తనేదో బుక్ ఓపెను చేస్తుంటే " బొమ్మలు చూపిస్తా అని బుక్ తీస్తోందేంటి " అనుకున్నా...
తను ఆ పుస్తకం తెరవగానే నేను అవాక్కయ్యాను.

అది తన డ్రాయింగ్ బుక్...
తన రంగుల ప్రపంచానికి ఇంకా రంగులు దిద్దింది...
ఒక్కొక్క పేజీ తిప్పుతూ వడి వడిగా కదులుతున్న నా చేతులు
ఒక్క సారిగా ఆగిపోయాయి. నా చూపు ఆ పేజీకి అతుక్కుపోయింది...

సూర్యుడు కొండల చాటున దాక్కుని మేఘాలకు దారిస్తుంటే
ఆ మబ్బుల నీడన చేతులు పెన వేసుకుని చిన్నారి స్నేహితులిద్దరు
నడుస్తూ ఉన్నారు...
అక్కడ నా పేరూ తన పేరూ రాసి ఉన్నాయి...
ఈ బొమ్మ ఎప్పుడు వేసావు ? అని అడిగాను తనని.
" ఒక రోజు నాకు వచ్చిన కల ఇది.
ఆ తర్వాతి రోజే నిన్ను చూసాను...
ఆ సాయంత్రమే ఇది వేసాను. ఎలా ఉంది ? " అంది.
నా నోట మాట లేదు...
నేను ఇంకేమి మాట్లాడకుండా అక్కడ నుండి వచ్చేసాను.
తను ఏం అనుకుందో తెలీదు,
ఎందుకలా వెళ్ళిపోయావ్ ? అని కూడా ఎప్పుడూ తను నన్ను అడగలేదు...

ఆ డ్రాయింగ్ చూసిన క్షణం నా మనసు నిశ్చలంగా ఉండిపొయింది.
తన ఊహకి నమ్మకాన్ని చేర్చిన తీరు నన్ను కదిలించి వేసింది...
జీవితం లో తననెప్పుడూ సంతోషంగా ఉంచాలని
ఆ క్షణం నిశ్చయించుకున్నాను...
తన చివరి క్షణాల వరకూ కూడా అలానే ఉండటానికి ప్రయత్నించాను.
తను మాత్రం నాకు తన గురుతులను మాత్రమే వదిలి వెళ్ళింది.

Saturday, October 27, 2012

తను అడిగిన ప్రశ్న " నీ పేరేంటి ? " అని...

ఆ తర్వాత 3 రోజుల వరకు వరుసగా తను
నాకు చాక్లేట్స్ ఇస్తూనే ఉంది...
సడనుగా ఒకరోజు నాకోసం ఏం తెచ్చావ్ ? అన్నది.
నేను ఏ మాత్రం ఆలోచించకుండా
" నీవు కోరుకున్నది నీకెప్పుడో ఇచ్చేసాను.
దానికంటే విలువైనది ఇంకేమీ లేదు. "
అని సమాధానం ఇచ్చాను...
వెంటనే " నేను ఊహించిన జవాబే ఇచ్చావు... " అన్నట్లు
తన ముఖం లో చిన్న చిరునవ్వు చోటు చేసుకుంది...

అప్పటి వరకు వెనక పెట్టిన చేతులని ముందుకు తెచ్చి,
నా చేతులలో ఒక చిన్న పుస్తకం పెట్టింది...
దాని పేరు " My Heart With No Vacancy "...
నేను కళ్ళు పెద్దవి చేసి తన వైపు చూసాను...
ఆ చూపు లోని ఉద్దేశ్యం
" చదివేది 3 వ తరగతి, ఇంగ్లిష్ స్పెల్లింగ్సే సరిగా రావు...
ఈ పుస్తకం చదవాలా..!!!? " అని.
తను అది త్వరగానే అర్దం చేసుకుంది...

ఒక్క కాలు మీద మోపు చేసి నించుని, కనుబొమ్మలు పైకి పెట్టి
" ఈ పుస్తకం నువ్ ఇప్పుడు చదవనవసరం లేదు.
నీకు ఎప్పుడైతే ఇంగ్లిష్ పర్ఫెక్ట్ గా వస్తుందో అప్పుడు చదువు చాలు. "
అనేసరికి " హమ్మయ్య..! " అనే ఒక భావన నా ముఖం పై చోటు చేసుకుంది.
సరేలే టాటా అని చెప్పి వెనక్కి నడిచాను...
తను కూడా వాళ్ళ ఇంట్లోకి కదిలింది.

కొంత దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి పిలిచింది.
వెళ్ళాను...త్వరగా చెప్పు లేట్ అవుతోంది అన్నాను...
అప్పుడు తను అడిగిన ప్రశ్న " నీ పేరేంటి ? " అని...
నేను షాక్ తిన్నాను...
నా పేరు తెలియకుండానే స్నేహం చేస్తున్నావా ?? అని అడిగాను.
తను " మనసు అవసరాలు కోరితే స్నేహం కలుషితం అవుతుంది.
అందుకే తెలుసుకోలేదు... " అని సమాధానం ఇచ్చింది.
మరైతే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ? అని ఎదురు ప్రశ్న వేసాను.
" స్నేహం మొదలు పెట్టటానికి పేరు అవసరం లేదు...
కానీ స్నేహం లో పేర్లు తెలుసుకోవాలిగా... " అంది.
నేను చిన్న నవ్వు నవ్వి
" నన్ను నా వాళ్ళు చిన్నా అని పిలుస్తారు... " అని చెప్పి వెళ్ళిపోయాను...
నేను ఆ సందు తిరిగేంత వరకు తను నా వైపు చూస్తూనే ఉంది.
ఆ తర్వాత తను కూడా వాళ్ళింట్లోకి వెళ్ళిపోయింది...

ఆరోజు తను చూసిన చూపు, ఆ చిరునవ్వు నాకిప్పటికీ గుర్తున్నాయి.
ఆ గురుతులు ఎప్పటికప్పుడు నా బాధలని తుంచేస్తుంటాయి.

-
చిన్నా ( జి.వి.ఆర్ )

Friday, October 26, 2012

ఏ నాడూ తన మనసుని కష్టపెట్టలేదు...

మేము స్నేహితులమైన మూడు రోజుల వరకు
తను నాకు కనిపించలేదు...
ఆ 3 రోజులు మాత్రం తను ఎందుకు లేదు ?
ఎటు వెళ్ళింది ? అని ఆలోచిస్తూనే ఉన్నాను.
ఆ తర్వాత రోజు తను కనిపించింది...
కానీ స్కూల్ లో ప్రార్ధన మొదలైందని
త్వర త్వరగా లోవలకి వెళ్ళిపొయాను...
మళ్ళి సాయంత్రం వరకు బయటకి రావటానికి కుదరలేదు...

సాయంత్రం స్కూల్ అయిపోగానే బయటకి వచ్చాను...
అప్పుడే తను పరిగెడుతూ వస్తోంది....
ఏంటి పరిగెడుతూ వస్తున్నావ్ ? అని అడిగాను.
నా చేయి లాగి ఒక 5స్టార్ చాక్లేట్ చేతిలో పెట్టి,
మన స్నేహం లో మొదటి తాయిలం...
ఇలా ఇస్తూనే ఉంటాను అని చెప్పింది.
నేను థాంక్స్ చెప్పి కదలబోయాను...
తను నా చేయి పట్టుకుని ఆపి
" నువ్వు నాకు నెల రోజులుగా తెలుసు...
నీకు నేను నాలుగు రోజులుగా తెలుసు.
కానీ ఆ తేడా కనిపించనీయవు అని ఆశిస్తున్నాను... " అన్నది.
ఆ మాటలే మళ్ళి మళ్ళీ గుర్తు తెచుకుంటూ
అన్నయ్యతో పాటు ఇంటికి నడక సాగించాను...

కాసేపటికి తన మాటల లో ఉన్న సారాంశం అర్ధమైంది...
పరిచయాలు రోజులు మారినా
మనసులు పూర్తిగా అర్ధం చేస్కోవాలి అనేదే తన ఉద్దేశ్యం.
అది అర్దం అవ్వగానే తన మీద ఇంకా ఇష్టం పెరిగింది.
అంత మెచ్యూర్డ్ గా ఆలోచించే తన మనసు
నాకు పూర్తిగా అర్దం అయ్యింది...
ఆ మనసుని జీవితాంతం హ్యాపీ గా ఉంచాలనుకున్నాను...
తన కన్నుమూత వరకు
ఏ నాడూ తన మనసుని కష్టపెట్టలేదు...
తను బాధపడుతుంటే ఏనాడూ చూస్తూ ఊరుకోలేదు...

-
చిన్నా ( జి.వి.ఆర్ )

Wednesday, October 24, 2012

తన పరిచయం నాకిప్పటికీ గుర్తుంది...

నా రెండవ తరగతి ముగిసింది...
ఆ పాఠశాల కూడా మూసేసారు.
మూడవ తరగతి కోసం ఇంకొక స్కూల్ లో చేరాను...
అప్పుడే కావ్య నా జీవితం లోకి వచింది...
తన పరిచయం నాకిప్పటికీ గుర్తుంది.
తను మా స్కూల్ ఎదురుగా ఉండేది...

ఒక రోజు నేను నా క్లాస్మేట్స్ తో బయటకి వచాను...
తను పిలిచింది...
వెళ్ళి ఏంటి అని అడిగాను...
నాకు నువ్వు బాగా నచావ్, నాతో స్నేహం చేస్తావా అంది.
బేసిక్ గా అబ్బాయిలు చాలావరకు బూతులు మాట్లాడతారని
నేను ఎక్కువగా అమ్మాయిలతోనే ఉండేవాడిని...
కానీ ఎప్పుడూ ఒక అమ్మాయితో స్నేహం చేయాలని అనిపించలేదు.
సడనుగా తను అలా అడిగే సరికి ఏం చెప్పాలో తెలియక
నడుస్తూ ముందుకు కదిలాను...
" ఓయ్..! సమాధానం చెప్పి వెళ్ళు " అన్నది...
వెంటనే వెనకకి తిరిగి " నీతో స్నేహం ఎందుకు చేయాలి ? " అని అడిగాను...
తను లోపలికి వెళ్ళిపోయింది...
నేను కూడా కాసేపు తిరిగి క్లాస్ కి వెళ్ళిపోయాను.

రెండు రోజుల వరకు తను నాకు కనిపించలేదు...
అది జరిగిన మూడవ రోజు నా పుస్తకం లో ఒక కాగితం కనిపించింది...
దానిలో ఏదో రాసి మడిచి ఉంది...
తెరిచి చూసాను...అందులో ఇలా ఉంది...
" నాతో స్నేహం చేయటానికి కారణం అవసరం లేదు...
నీకు కావాలనిపిస్తే ఇదే కారణం అనుకో " అని రాసి,
కింద " కావ్య " అని రాసి ఉంది...
తను రాసిన మాటలలో నాకు తన వ్యక్తిత్వం కనిపించింది...
కానీ కావ్య ఎవరు ? మొన్న కలిసిన అమ్మాయి ఎవరు ?
ఇద్దరూ ఒకటేనా..? కానీ తను నా స్కూల్ కాదే..!!?
ఇలా చాలా సందేహాలు వచాయి...

ఆరోజు సాయంత్రం స్కూల్ అయిపొయాక బయటకి వస్తుంటే
తను ఎదురుగా ఉండి కళ్ళు ఎగురవేస్తూ ఏంటి సంగతి ? అన్నట్లు సైగ చేసింది.
నేను తన దగ్గరకు వెళ్ళి " నీ పేరు కావ్యనా ? " అని అడిగాను...
" కాకపోతే ఎంటి ? " అని అడిగింది.
నేను కాం గా ముందుకు కదిలాను...
తను ఆ లెటర్ లొ ఉన్న మాటలు మళ్ళీ చెప్పింది...
నేను వెనక్కి తిరిగి ఒక చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయాను...
తన స్నేహానికి ఒప్పుకుంటూ చిందించిన నవ్వు అది.
తనకి కూడా అది అర్దమైంది...

ఆరోజు నుంచి మా స్నేహం మొదలైంది...
13 వత్సరాలు ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా సాగింది...

-
చిన్నా ( జి.వి.ఆర్ )

నా రహస్య స్నేహితురాలు కావ్య...

అందరికీ నమస్కారం...

నేను చాలా సున్నితమైన మనసు కలిగిన వాడిని...
నాకు ఒకరితో ఒకలా, ఇంకొకరితో ఇంకోలా ఉండటం తెలియదు...
నా ఇరవై ఏళ్ళ జీవితం లో 
ఎవరినీ నొప్పించలేదు, ఎదురూ చెప్పలేదు...
బాధలను భరిస్తూ బంధాలు నిలవాలని నిత్యం కోరుకున్నాను...
నేను ఎవరితోనూ అబద్దాలు చెప్పలేదు...
నా పర అనే భేదాలు చూపలేదు...
నా చెడు కోరే వారిని సైతం స్నేహితులుగా భావించాను...
నేనెప్పుడూ ఒకరి చెడు కోరలేదు...
ఎవరికీ వ్యతిరేకంగా ఉండలేదు...
కానీ ఒక్క విషయం మాత్రం గోప్యంగా ఉంచాను...

తనే కావ్య...
కనీసం నా కుటుంబ సభ్యులకి కూడా చెప్పలేదు...
తను నాకు మంచి గురువు...నా మార్గదర్శి...
నేను ఇంత నిజాయితీగా ఉండటానికి తను కూడా కారణం...
ఎల్లప్పుడూ సమాజం తో పోలిక వద్దంటూ
నీవైనా సరిగా ఉండాలి అంటూ చెప్పేది...

తన మాటలు నేను మరువలేను...
తను నాకు మాట ఇచ్చింది జీవితాంతం తోడుంటానని...
నా ప్రేమ విషయం లో సైతం నా బాధలను, సంతోషాలను పంచుకుంది...
నిరంతరం నా జీవితం తన జీవితం లా భావించి
నన్ను ఇంత గొప్పగా నిలబెట్టింది...

ఈరోజు నేను ఇలా నా వ్యక్తిత్వం లో, చదువు లో ప్రత్యేకంగా ఉన్నానంటే
తన మూలంగానే...
నా ప్రతి అడుగులో నాకు చేయందించింది...
తను ఉన్నంత కాలం నాకు ఒంటరితనం అనే భావన రానివ్వలేదు...
కానీ చివరికి ఆ ఒంటరితనాన్ని వదిలి

ఇకనుండి నా జీవితం నా చేతిలోనే ఉందని చెప్పి
తన జీవితాన్ని ముగిస్తూ కన్నుమూసింది...

తన గురుతులను నేను మరువలేను...
తననీ మరచిపోలేను...
తన చివరి కోరిక నా సంతోషం...
తన ఆఖరి క్షణాలలో కూడా నా గురించి ఆలోచించింది...
తన లాంటి స్నేహితురాలు నాకు మళ్ళీ దొరకదు...
ఇన్నాళ్ళూ తన స్నేహాన్ని దాచి ఉంచాను...
ఇప్పుడు తన గుర్తులని మరువకుండా ఉండాలనే ఈ బ్లాగు మొదలుపెట్టాను...
తన ప్రతి ఒక్క మాటనూ ఇందులో పొందుపరుస్తాను...


-
చిన్నా ( జి.వి.ఆర్ )